గత నెలరోజులుగా హైదరాబాద్ ను వర్షం అతలాకుతలం చేస్తోంది. లేటేస్ట్ గా మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 2025 సెప్టెంబర్ 26న ఈ నదిపై ఉన్న హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో ఒక్కసారిగా వరద ఉప్పొంగి ప్రవహించింది. తీర ప్రాంతాల్లోకి దాదాపు నీరు చేసింది. ఈ నేపథ్యంలో 1908 సంవత్సరంలో కూడా మూసీ నది ఉప్పొంగింది. ఇది హైదరాబాద్ వాసులకు చీకటి రోజు అని చెప్పవచ్చు. అప్పుడు ఏం జరిగింది?
1908 నాటి బీభత్సమైన వరదలు:
మూసీ నది చరిత్రలో అత్యంత ముఖ్యమైన మలుపు 1908లో సంభవించిన భయంకరమైన వరదలు (Great Musi Flood). 1908 సెప్టెంబర్ 28న కేవలం ఒక్క రోజులో 98.57 సెంటిమీటర్ల వర్షం కురవడంతో మూసీ నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగింది. దీని వల్ల హైదరాబాద్ నగరంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ వరదల తర్వాతనే అప్పటి నిజాం పాలకులు అప్రమత్తమై, నగర అభివృద్ధికి ప్రణాళికలు రచించారు. ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు వరదలను నియంత్రించడానికి చర్యలు చేపట్టారు.

మూసీనది ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో, రమణీయమైన ప్రకృతి అందాలతో కళకళలాడింది. దీనిని పూర్వకాలంలో ‘ముచుకుందా’ నది అని కూడా పిలిచేవారు.
మూసీ నది ప్రవాహం :
మూసీ నది తెలంగాణలోని వికారాబాద్ జిల్లా, అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది. అనంతపద్మనాభస్వామి ఆలయం ప్రాంగణంలోని సహజ ఊట (Natural Spring) నుంచే ఈ నది ప్రవాహం మొదలవుతుందని చెబుతారు.ఇక్కడ ప్రారంభం అయిన మూసీ నది తూర్పు దిశగా సుమారు 240 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ ప్రవాహంలోనే ఇది హైదరాబాద్ నగరంలోని పాత నగరాన్ని, కొత్త నగరం నుంచి వేరుచేస్తూ ప్రవహిస్తుంది. హైదరాబాద్‌ను దాటిన తర్వాత దీనికి చిన్నమూసీ నది, ఆలేరు నదులు కలుస్తాయి. నల్గొండ జిల్లాలోని వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.

మూసీ నది చరిత్ర:
16వ శతాబ్దంలో గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశీయులు, ముఖ్యంగా హైదరాబాద్ వ్యవస్థాపకుడు మహ్మద్ కులీ కుతుబ్ షా, ఈ నది ఒడ్డునే నగరాన్ని నిర్మించారు. ఒకప్పుడు హైదరాబాద్ ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలను ఈ నదీ తీర్చేది. 1900ల ప్రారంభం వరకు మూసీ నది నీరు అత్యంత స్వచ్ఛంగా ఉండేది. నాటి చిత్రాలను బట్టి చూస్తే నది ఎంతటి అందమైన వైభవాన్ని కలిగి ఉండేదో తెలుస్తుంది. సరోజినీ నాయుడు వంటి కవులు మూసీని ‘తెల్లని నది’ (White River) గా వర్ణించారు. మూసీ నది ఉపనదిపైనే హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడానికి చారిత్రక హుస్సేన్ సాగర్ సరస్సును నిర్మించారు. గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్ షా 1578లో మూసీ నదిపై పురానా పుల్ (పాత వంతెన) ను నిర్మించారు. ఇది ఇప్పటికీ వాడుకలో ఉంది. నగరంలో దీనిపై మొత్తం ఏడు వంతెనలు ఉన్నాయి.
జలాశయాల నిర్మాణం:
వరదలను అరికట్టి, నగరానికి తాగునీరు అందించే లక్ష్యంతో మూసీ నదిపై 1920లో ఉస్మాన్ సాగర్ (గండిపేట), 1927లో దాని ఉపనది మూసీపై హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించారు. ఈ ప్రాజెక్టుల కారణంగానే మూసీ వరదలు చాలా వరకు నియంత్రించబడ్డాయి.

కాలక్రమేణా, విపరీతమైన పట్టణీకరణ, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు కలవడంతో మూసీ నది దాని పూర్వ వైభవాన్ని కోల్పోయింది. హైదరాబాద్ నగరంలోని 20 కిలోమీటర్ల పరిధిలో ఇది కేవలం మురుగు కాలువలా (Sewage) మారిపోయింది. ఆక్రమణల కారణంగా నది వెడల్పు తగ్గి, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కోఠి వంటి ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి.






