ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో గ్రామ ప్రజలు ఎవరూ వంట చేసుకోవద్దని.. ప్రభుత్వమే మూడు పూటలా ఆహారం సరఫరా చేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఈ గ్రామంపై అధికారులతో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు ఆందోళనన కలిగిస్తున్నాయి. ఒక్కసారిగా జ్వరం రావడం.. ఆ తరువాత అంతుచిక్కని వ్యాధిబారినపడి.. మరణించడం జరుగుతోంది. మూడ నెలల వ్యవధిలో ఈ గ్రామంలో 23 మంది మరణించారు. దీంతో ఈ మరణాలకు కారణాలేంటి? అన్న దానిపై వైద్యులు ప్రయత్నాలు ప్రారంభించారు.
తురకపాలెంలో వరుస మరణాలకు మెలియాయిడోసిస్ అని కొందరు అంటున్నారు. శుక్రవారం కొంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే అధికారులు దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?
మెలియాయిడోసిస్ అనేది Burkholderia pseudomallei అనే బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన సంక్రమణ వ్యాధి. ఇది ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలు అనగా ఆసియా, ఆస్ట్రేలియా, కొన్ని ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా దేశాల్లో కనిపిస్తుంది.ఈ బ్యాక్టీరియా సాధారణంగా మట్టిలో, నీటిలో నివసిస్తుంది. వర్షాకాలంలో రైతులు, నీటి లోపల పని చేసే వారు, బహిరంగంగా పనిచేసే వారు అధికంగా ఈ వ్యాధికి ప్రభావితమవుతారు. గాయం ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేసిస్తుంది. కలుషితమైన నీటి బిందువులు లేదా దుమ్మును శ్వాసించటం ద్వారా శరీరంలోకి వెళ్తుంది.
వ్యాధి ఏర్పడే ముందు అధిక జ్వరం, వణుకు ఉంటుంది. శ్వాస సంబంధిత సమస్యలు (న్యుమోనియా) వస్తాయి. శరీరంలో గడ్డలు, చర్మపు గాయాలు, కిడ్నీలు, లివర్, స్ప్లీన్ వంటి అవయవాలలో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. అలాగే సెప్సిస్ వల్ల షాక్‌కు వెళ్లే అవకాశం ఉంది. తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారు, మద్యం అధికంగా సేవించే వారికి ఈ వ్యాధి తీవ్ర ఉంటుంది. మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తగ్గిన వారు ఈ వ్యాధి బారిన పడొచ్చు. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, ఊపిరితిత్తుల స్కాన్ ద్వారా దీనిని గుర్తిస్తారు. బ్యాక్టీరియాను గుర్తించడానికి ల్యాబ్ కల్చర్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
దీర్ఘకాలిక యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా చికిత్స చేస్తారు. మొదటగా సెఫ్టాజిడైమ్, మెరోపెనెమ్ వంటి మందులు ఇస్తారు. తరువాత దీర్ఘకాలికంగా ట్రైమెథోప్రిమ్-సల్ఫామెథోక్సాజోల్ వంటి మందులతో చికిత్స కొనసాగిస్తారు. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయం ఉండే అవకాశం ఉంది. గాయాలు ఉంటే వాటిని శుభ్రంగా కడగడం.. మట్టిలో పని చేసేటప్పుడు చేతి తొడుగులు, బూట్లు వాడటం.. కలుషిత నీటిని తాగకుండా ఉండటం వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం వంటివి చేయడం వల్ల త్వరగా వ్యాధి బారిన పడకుండా ఉంటారు.





