Saturday, December 6, 2025

ఉపాధ్యాయుల సేవలను వెలకట్టలేం

కరీంనగర్: విద్యారంగంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని, అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తుగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు . జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తల్లి లాంటి వారని, వారు పిల్లలను ఆదరించి చక్కటి విద్యాబుద్ధులు నేర్పాలని అన్నారు. చాలామంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని, వారికి సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. వేలాదిమంది భవిష్యత్తును సన్మార్గంలో నడిపే అవకాశం ఉపాధ్యాయులకు ఉందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి పాఠశాలల్లో తమ పిల్లల విద్యా విషయాలను వివరించాలని, తద్వారా హాజరు శాతాన్ని మరింతగా పెంచుకోవచ్చని అన్నారు. ఉపాధ్యాయులు 100% పాఠశాలకు హాజరైతే విద్యార్థుల హాజరు కూడా అదేవిధంగా నమోదవుతుందని అన్నారు. పాఠశాల విద్యలో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని కోరారు. అవార్డు స్వీకరించిన వారు మాత్రమే కాకుండా చాలామంది ఉపాధ్యాయులు తమ సేవలను గోప్యంగా అందిస్తున్నారని అన్నారు. వారందరికీ అభినందనలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్థులను గమనిస్తూ ఉండాలని, వారు ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా చూసుకోవాలని అన్నారు. చెడు అలవాట్ల బారిన పడకుండా సంరక్షించాలని సూచించారు. విద్యార్థులను తల్లిలా ఆదరిస్తూ సన్మార్గంలో నడిపించాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 43 మంది ఉపాధ్యాయులకు, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 17 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులను సత్కరించారు. గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించిన 95 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గోడ గడియారాలను బహుమతులుగా అందజేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సృజనాత్మకతతో ఈ గడియారంలో పాఠశాల విద్యలో అవలంబించాల్సిన 12 అంశాలను సూచికలుగా పొందుపరిచి రూపొందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News