తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ లోని Meteorological Analysis ప్రకారం.. బుధవారం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం దక్షిణ ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటింది. మధ్య ఛత్తీస్ గఢ్ లో అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతోంది. దీంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం.. గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది . నేడు, మరో రెండు రోజులు చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది . రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.





