Saturday, December 6, 2025

కోతుల సమస్య పరిష్కారానికి రైతుల వినూత్న ఆలోచన..

ఇప్పుడు గ్రామాల్లో మనుషుల కంటే కోతులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఇళ్లపై కోతులుసంచారం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోతుల దాడితో గాయాలు అయిన సంఘటనలూ ఉన్నాయి. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎంత విన్నవించుకున్నా.. పరిష్కారం లభించడం లేదు. దీంతో కొన్ని గ్రామాలవారు కోతులను డబ్బులు పెట్టి వాటిని పట్టేవారిని పిలిపిస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కొండెంగల బొమ్మలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే తాజాగా కొందరు రైతులు మరో ఆలోచన చేశారు. ఈ ఆలోచనతో కోతులు ఉరుకులు పెడుతున్నట్లు రైతులు తెలుపుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోతుల బెడద తీవ్రమైంది. ఎటూ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఇళ్లల్లోకి చేరి వంటకు సంబంధించిన సమాన్లను సైతం ఎత్తుకెళ్తున్నాయి. కొందరు దాడి చేయడానికి ప్రయత్నిస్తే తిరిగి గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి. ఈ తరుణంలో కొందరు రైతులు వినూత్న ఆలోచన చేశారు. కోతులను తరిమి కొట్టేందుకు పులి బొమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద బొమ్మలను తమ పంట పొలాల్లో ఏర్పాటు చేసుకున్నారు. వీటిని చూసిన కోతులు దూరం వెళ్తున్నాయి. రైతులు ఎక్కడికి వెళ్లినా వీటిని వెంటబెట్టుకొని వెళ్తున్నారు.

ఎక్కువగా కూరగాయలు పండించే రైతులు కోతుల బెడదతో తీవ్రంగా విసిగిపోయారు. దీంతో ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే పులి బొమ్మ ఒక్కోటి రూ.3 వేలకు పైగానే ఉందని, అయినా ఈ డబ్బు పెట్టి రైతులు పులి బొమ్మలు కొనుగోలు చేసి వాటిని కాపాడుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఎటూ చూసినా ఈ పులి బొమ్మలే కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన మిగతా గ్రామాల ప్రజలు కూడా ఈ పులి బొమ్మలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అయితే గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం గొల్లపల్లి, బొప్పాపూర్ తదితర గ్రామాల్లోనూ ఈ సమస్య ఉండేది. వారు కూడా ఈ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనూ కోతుల బెడద తీవ్రమైంది. దీంతో కొందరు కొండెంగల ఫ్లెక్సీ బొమ్మలను ఏర్పాటు చేసుకొని కోతుల బారి నుంచి కాపాడుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News