ఇండిపెండెన్స్ డే వేడుకలు శుక్రవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జెండా పండుగ నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా నిలిచాలి. వేడుకల్లో భాగంగా ఈమె బధిర విద్యార్థులతో కలిసి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కలెక్టర్ ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. దివ్యాంగుల మనసులను అర్థం చేసుకోవడానికి, వారి సమస్యలను తెలిపేందుకు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ బేసిక్స్ పై తెలియజెప్పారు. ఈ లాంగ్వేజ్ ద్వారా వారి సమస్యలను అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ లాంగ్వేజ్ ద్వారా బధిరుల సమస్యలను తెలుసుకోవచ్చని తెలిపారు.
కరీంనగర్ కలెక్టర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రతిరోజూ విద్యార్థులను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాలలకు వెళ్లి వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. అలాగే వారి విద్యాబోధన ఎలా ఉంది? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా కలెక్టర్ బధిరులతో కలిసి జాతీయ గీతం ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కలెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.





