ఈ సృష్టిలో అందమైన బంధం స్నేహం… పుట్టినప్పటి నుంచి మరణించేవరకు స్నేహితుడు మాత్రమే తోడుంటాడు.. తల్లిదండ్రులకు, జీవిత భాగస్వామికి చెప్పేలేని రహస్యాలు స్నేహితుతో పంచుకోవచ్చు.. ఆపద సమయంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి సాయం చేసేవాడు స్నేహితుడు మాత్రమే.. ఇలాంటి గొప్ప స్నేహం పొందాలంటే ఎంతో మంచి మనసు ఉండాలి. అయితే బిజీ వాతావరణం గడుపుతున్న నేటి కాలంలో స్నేహితులంతా ఒకరోజు కలిసి ఉల్లాసంగా ఉండాలని అనుకొని ప్రతీ ఏడాది ఆగస్టు 5న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్నేహితులంతా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అయితే ఈ స్నేహం అనేది త్రేతా యుగం నుంచే ఉందని పురాణాలు తెలుపుతున్నాయి. ఆ కాలంలోనే శ్రీరాముడితో కొందరి వ్యక్తులు స్నేహంగా ఉండి నిజమైన స్నేహితుతులు అనిపించుకున్నారు. మరి వాళ్లేవరంటే?
హనుమంతుడు:
హనుమంతుడు శ్రీరామునికి అత్యంత విశ్వసనీయమైన, నిబద్ధతతో కూడిన భక్తుడే కాకుండా, నిజమైన స్నేహితుడు కూడా. ఆయన నిస్వార్థంగా శ్రీరాముని కోసం పని చేస్తాడు. ఆపదలో రాముడికి సహాయం చేస్తాడు. ఎలాంటి స్వార్థం లేకుండా ఒక వ్యక్తి కోసం స్నేహితుడు మాత్రమే సాయం చేస్తాడు. అంతటి సాయం ఆంజనేయస్వామి చేసినందువల్ల శ్రీరాముడికి నిజమైన స్నేహితుడిగా మారాడు.
సుగ్రీవుడు:
సీత జాడను వెతికే క్రమంలో శ్రీరాముడికి సుగ్రీవుడు ఎంతో సాయం చేస్తాడు. సుగ్రీవుడి తోడ్పాటుతో వానరసైన్యం సహాయంగా మారుతుంది. సుగ్రీవుడు కూడా భార్యవియోగంతో బాధపడుతాడు. దీంతో సుగ్రీవుడికి రాముడు సాయం చేస్తాడు. ఇలా ఒకరికి మరొకరు సాయం చేసి నిజమైన స్నేహితులు అనిపించుకుంటారు.
విభీషణుడు:
శ్రీరాముడికి ప్రధాన శత్రువు అయిన రావణాసురుడు సోదరుడు విభీషణుడు. ఈయన ప్రత్యర్థి స్తానంలో ఉన్నప్పటికీ ధర్మం కోసం పోరాడుతాడు. ఈ సమయంలో రాముడు చేసే పనికి మద్దతుగా ఉంటాడు. దీంతో శ్రీరాముడికి విభీషణుడు స్నేహితుడిగా మారిపోతాడు. ఆ తరువాత రాముడి పక్షాన నిలవడంతో శ్రీరాముడు తన యుద్ధం గెలుస్తాడు.
గుహుడు (నిషాద రాజు):
శ్రీరాముడు అరణ్యంలోకి వెళ్ళే సమయంలో, గుహుడు అనే నిషాద రాజు శ్రీరాముడికి స్వాగతం పలుకుతాడు. అయితే గుహుడు వేటగాడు. కానీ ఇతనికి ఇక్ష్యాకు వంశస్తులంటే చాలా ఇష్టం. దీంతో రాముడిని సాదరంగా ఆహ్వానిస్తాడు. అయితే గుహుడిప్రేమను చూసి రాముడు అతడి స్నేహితుడిగా మారిపోతాడు.
ఇలా పురాతన కాలం నుంచే స్నేహానికి విలువ ఉంటూ వస్తోంది. అయితే స్నేహం అంటే కేవలం అవసరానికోసం మాత్రమే కాకుండా జీవితాంతం కష్టసుఖాల్లో ఉండే వారిని మాత్రమే ఎంచుకోవాలి. అప్పుడే వారితో కలిసి ఉన్నప్పుడల్లా సంతోషంగా ఉంటుంది.





