రష్యాలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.7 తీవ్రతతో నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.దీంతో రష్యాలో సముద్ర తీరంలో ఉన్న ప్రాంతం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రష్యాలో గతంలోనూ 1952వ సంవత్సరంలో భారీ భూకంపం ఏర్పడింది. ప్రస్తుతం ఏర్పడిన కమ్చట్కా ప్రాంతంలోనే ఆ సమయంలో 9.0 తీవ్రతతో నమోదైంది. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద భూకంపం ఏదో తెలుసుకుందాం..
ఇప్పటి వరకు సంభవించిన భూకంపాల్లో చిలీ భూకంపం అతిపెద్దదిగా చెప్పుకుంటారు. 1960లో ఈ దేశంలోని బయోబియో ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 9.5 తీవ్రతతో ఇక్కడ భూకంపం ఏర్పడింది. దీనినే వాల్డివియా భూకంపం అని అంటారు. 1960 మే 22న దక్షిణ చీలీ ప్రాంతంలో ఉన్న పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడి ఈ భూకంపంతో సముద్రం 25 మీటర్ల ఎత్తుకు లేచింది. దీంతో ఇక్కడ 1655 మందికి పైగా మరణించినట్లు సమాచారం. 3 వేల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
అయితే చిలీ లో ఇంత పెద్ద భూకంపం రావడానికి కారణాలు ఉన్నాయి. ఈ దేశం నాజ్కా ప్లేట్, అమెరికా ప్లేట్ మధ్య ఉండడంతో ఈ రెండు ప్లేట్ల మధ్య జరిగే ఒత్తిడి కారణంగా భూకంపాలకు దారి తీస్తుంది. చిలీ దేశంలో అనేక భూకంపాలు సంభవించాయి. కానీ వీటిలో వాల్టివియా భూకంపం, 1971 అకాన్ కాగువా, 2010 చిలీ భూకంపం, 2014 ఇక్విక్ భూకంపం ప్రధానమైనవిగా చెప్పుకుంటారు.
భారతదేశంలో అతిపెద్ద భూకంపం 1934లో జరిగిన బీహార్-నేపాల్ భూకంపంగా చెప్పుకుంటారు. ఈ సమయంలో రిక్టర్ స్కేల్ పై 8.0 తీవ్రత నమోదైంది. జనవరి 15న ఏర్పడిన ఈ భూకంపంతో నేపాల్ లో ఎక్కువగా విధ్వంసం జరిగింది. బీహార్ లోని పాట్నా, బార్, జమాల్వూర్ ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఈ సమయంలో 8,519 మంది మరణించినట్లు సమారారం. 80 వేల కంటే ఎక్కువగా భవనాలు ధ్వంసం అయ్యాయి.





