తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల సాయం చేస్తోంది. ఈ పథకం ఇప్పటికే ప్రారంభమైంది. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు గోడల వరకు పూర్తయ్యాయి. అయితే మరికొన్ని గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోస్తున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో భవన నిర్మాణ కార్మికులకు డిమాండ్ పెరిగింది. దీంతో మేస్త్రీల నుంచి కార్మికుల వరకు బిజీగా మారిపోయారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారు సైతం భవన నిర్మాణ కార్మికుల కోసం వెతుకుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని ఓ మేస్త్రీ లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. దీని వివరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లా చిన్న శంకరపేట్ మండలం మిర్జాపల్లి తండాలో మొత్తం 22 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీరు బేస్ మెంట్ నిర్మాణం పూర్తి చేసుకోవడంతో ఒక్కొక్కరి ఖాతాలో రూ. లక్ష జమ అయ్యాయి. దీంతో వీరు ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాలని అనుకున్నారు. దీంతో ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ యూనస్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తానని వీరితో కాంటాక్ట్ అయ్యారు. దీంతో కొంత డబ్బు తీసుకున్న ఈయన ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఆ తరువాత మరికొన్ని డబ్బులు వసూలు చేశాడు. ఇలా ఒక్కొక్కరు రూ. లక్షకు పైగానే చెల్లించారు. అయితే జూలై 26 నుంచి అబ్దుల్ యూనస్ ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి రాలేదు. దీంతో అతడికి ఫోన్ చేయగా.. స్విచ్ఛాప్ వచ్చింది. అతని ఇంటికి వెళ్లి చూడగా.. ఖాళీ చేసినట్లు యజమాని తెలిపాడు.
దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆశ్రయించారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేస్తే ఇలా కొందరు మోసం చేసేవారు కూడా ఉంటున్నారని బాధితులు వాపోతున్నారు. అయితే ఇళ్లు నిర్మించుకునేవారు ఎవరైనా ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.





