నేటి కాలంలో చాలా మంది ప్రతీ విషయంలో డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. అందుకే ఏదైనా సలహా అడిగితే అందులో కూడా స్వార్థం చూసేవారు ఉన్నారు. అలాగే ఏదైనా సాయం అడిగితే.. ఆ సాయం చేస్తే మనకెంత వస్తుంది? అని ఆలోచించేవారు ఉన్నారు. అయితే కొందరు పేదలకు, మధ్యతరగతి ప్రజలకు సాయం చేయడానికి ముందుకు వచ్చే వారు కూడా ఉన్నారు. ఈరోజుల్లో కోర్టు కేసులు అంటే మాములు విషయం కాదు. చిన్న కేసుకే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. అలాంటిది ఓ వ్యక్తి కేవలం రూపాయి తీసుకొని న్యాయ సలహా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మరి ఆయన ఎలా ఇస్తున్నాడంటే?
కాలం మారుతున్న కొద్దీ కొందరిలో ఊహించని మార్పులు వస్తున్నాయి. కేవలం డబ్బుకే పనిచేసేవారు కొందరు ఉంటుంటే.. ఆదర్శ్ అనే వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా గొప్ప ఆలోచన చేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన ఈయన లా చదివాడు. అయితే వెంటనే కేసులను పట్టి డబ్బు సంపాదించాలన్న ఆలోచనకు బదులు పేదలకు ఉచితంగా న్యాయ సలహా ఇవ్వాలని అనుకున్నాడు. ఇందు కోసం ఆయన తొమ్మిది మంది స్నేహితులతో కలిసి 2025 మే లో Centralized Legel Network Solution (CLNS) అనే యాప్ ను ఏర్పాటు చేశాడు.
ఎవరైనా న్యాయ సలహా కావాలని అనుకునేవారు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తరువాత ఇందులో ఒక రూపాయి చెల్లిస్తే మీకు కావాల్సిన న్యాయ సహాయం అందుతుందని ఆయన చెబుతున్నాడు. అయితే ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖుల న్యాయవాదులు భాగస్వాములు అయినట్లు ఆయన తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 3 వేలకు పైగా సహాయం పొందినట్లు తెలుపుతున్నారు





