తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు పేరు దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకు పడిన ఉత్కంఠకు తెరపడినట్లయింది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నిన్నటి వరకు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ తో పాటు బండి సంజయ్ పేర్లు బాగా వినిపించాయి. కానీ అనూహ్యంగా రాంచందర్ రావు పేరును ఖరారు చేశారు. అయితే రాంచందర్ రావు బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
నారపరాజు రాంచందర్ రావు 1959 ఏప్రిల్ 27న హైదరాబాద్ లో జన్మించారు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కొనసాగారు. న్యాయవాది అయిన రాంచందర్ రావు 2009లో జరిగిన మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2018లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2021లో మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2024 జనవరి 8 నుంచి మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ అధ్యక్షుడిగా నామినేషన్ చేయనున్నారు. అయితే పార్టీలో ఎలాంటి స్పందన వస్తుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు బీజేపీ సీనియర్లు ఆయన పేరును పంపించినట్లు తెలస్తోంది.





