మహిళా సంఘాల గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. కొందరు మహిళలు కలిసి గ్రూపులుగా ఏర్పడి డబ్బులు పొదుపు చేస్తూ ఉంటారు. ఇలా పొదుపు చేసిన డబ్బులు కొందరి అవసరాల కోసం రుణం రూపేనా అందిస్తారు. ఆ తర్వాత తక్కువ వడ్డీతో ఆ మొత్తాన్ని తీసుకుంటారు. మహిళా సంఘాలను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. డ్వాక్రా పేరుతో ఏర్పడిన గ్రూపులకు ప్రోత్సాహకాలను అందిస్తూ వారికి ప్రత్యేక పథకాలను కూడా ప్రకటిస్తూ ఉంది. అయితే మహిళా గ్రూపుల లాగే ఇప్పుడు పురుషుల గ్రూపులు కూడా ఏర్పడుతున్నాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పురుషుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏప్రిల్ లో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ముఖ్య పట్టణాలను ఎంచుకున్నారు. పురుషుల స్వయం సహాయక సంఘాలు ఎలా ఉంటాయి? ఇది మహిళా సంఘాల లాగే పని చేస్తాయా? ఆ వివరాల్లోకి వెళితే..
2025 ఏప్రిల్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా పురుషుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ నగరాలను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని పురుషుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. పురుషుల స్వయం సహాయక సంఘం ఐదుగురు పురుషులతో ఏర్పడుతుంది. వీరు కనీసం రూ.100 రూపాయల చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెల కనీసం రూ .500 జమ చేయాలి. ఇలా ఆరు నెలల పాటు గ్రూపు సభ్యులు పొదుపు చేస్తే ఆ తర్వాత జమ అయిన మొత్తానికి బ్యాంకు ఆరు రెట్ల తో రుణం అందిస్తుంది. ఈ రుణం పై వడ్డీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాఫీ చేస్తాయి.
పురుషుల స్వయం సహాయక సంఘాల్లో కొందరు మాత్రమే సభ్యులుగా ఉంటారు. వీరిలో డొమెస్టిక్ వర్కర్స్, తోపుడు బండ్లు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, కేర్ టేకర్స్ వంటి వారు సభ్యులుగా ఉంటారు. అసంఘటిత రంగానికి చెందిన కార్మికులకు ఆదాయం వృద్ధి చేసేందుకు ఈ సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థికంగా స్థిరపడచ్చని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 3000 సంఘాలు ఏర్పాటు అయ్యాయి. వీటిని ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో ఈ సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.





