ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలన్నా కోరిక ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఉండే వారికి ఏదైనా స్థలం కొనుగోలు చేసి అందులో సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటారు. ఇందుకోసం దూర ప్రాంతాల్లో నైనా సరే స్థలం దొరికితే కొనుగోలు చేసి.. డబ్బులు ఉన్న సమయంలో గృహాన్ని నిర్మించుకుంటారు. అయితే ఇటీవల స్థలం కొనుగోలు విషయంలో చాలా వివాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా FTL, Buffer Zone స్థలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా స్థలం కొనుగోలు చేయాలనుకునేవారు ముందు జాగ్రత్తగా ఆ స్థలం ఎలాంటిదో తెలుసుకోవాలి. అయితే ఇటీవల కొందరు తక్కువ ధరకే భూమి వస్తుందని చెప్పి కన్జర్వేషన్ ల్యాండ్ ను విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. అసలు Conservation ల్యాండ్ అంటే ఏమిటి.? ఈ స్థలాన్ని ఎందుకు కొనుగోలు చేయొద్దు? ఒకవేళ కొనుగోలు చేస్తే ఏం జరుగుతుంది..?
హైదరాబాదులో నివసించే వారు ఇంటి స్థలం కోసం ఈమధ్య ఎక్కువగా అయోమయంలో పడ్డారు. కొత్తగా స్థలం కొనాలని అనుకునేవారు ఎక్కడ కొనాలో? ఏది మంచిదో? తెలియక సతమతమవుతున్నారు. అయితే ఎవరైనా స్థలం కొనగల కొనుగోలు చేయాలని ముందుకు వస్తే కన్జర్వేషన్ ల్యాండ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
2013 సంవత్సరంలో HMDA ఆధ్వర్యంలో 2031-Master Plan ఏర్పాటు చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ మొత్తం 7257 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 5965 స్క్వేర్ కిలోమీటర్లు భూమిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. ఈ భూమిలో ఎక్కడ నివాస స్థలాలు నిర్మించాలి? ఎక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్వహించాలి? ఎక్కడ వ్యవసాయ భూమిని ఉంచాలి? ఈ విధంగా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ను తయారు చేసింది.
మొత్తం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ను 12 జోన్లుగా విభజించారు. వీటిలో ఒకటి కన్జర్వేషన్ జోన్. కన్జర్వేషన్ జోన్ లోని భూమిని వ్యవసాయ లేదా వ్యవసాయ ఆధారిత పనుల కోసం మాత్రమే ఉపయోగించాలి. మిగతా ఎలాంటి నిర్మాణాలకు ఇందులో అనుమతులు లభించవు. మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో 40శాతం కన్జర్వేషన్ జోన్ గా పరిగణిస్తారు. మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో 2421 స్క్వేర్ కిలోమీటర్లు కన్జర్వేషన్ జోన్ కింద కేటాయించారు. కన్జర్వేషన్ జోన్ సిటీలో పలుచోట్ల ఉన్నది.
అందువల్ల హైదరాబాదు పరిధిలో స్థలం కొనుగోలు చేసే సమయంలో ఆ స్థలం కన్జర్వేషన్ జోన్ లో ఉందా? అనేది ముందుగానే తెలుసుకోండి. ఒకవేళ కన్జర్వేషన్ స్థలాల్లో కొనుగోలు చేయాల్సి వస్తే ఇందులో 25% మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలి. మిగతా స్థలాన్ని ఖాళీగా వదిలేయాలి. ఒకవేళ ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటే కన్జర్వేషన్ జోన్ పనికిరాదు. స్థలం కొనుగోలు చేసే సమయంలో సరైన డాక్యుమెంట్స్ తో పాటు ఈ జోన్ లో ఉందా? లేదా? ముందే తెలుసుకోండి లేకుంటే తీవ్రంగా నష్టపోతారు.