ప్రపంచ చెస్ ఛాంపియన్ గా ఇండియాకు చెందిన గుకేష్ దొమ్మరాజు సరికొత్త రికార్డు సృష్టించాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే 18వ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు. 14 రౌండ్ల పాటు సాగిన ఈ పోరులో డిపెండింగ్ చాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను 7.5-6.5 పాయింట్ల తేడాతో ఓడించాడు. చివరి రౌండ్ లో 58 ఎత్తుల్లో లిరెన్ ఆటకట్టించి విశ్వకిరీటాన్ని అందుకున్నాడు. తొలి రౌండ్ లో లిరెన్ షాక్ ఇవ్వడంతో అప్పటి నుంచి ఎత్తులకు పై ఎత్తు వేసి గుకేష్ పకడ్బందీగా పావులు కదిపాడు. ప్రపంచ చెస్ చాంపియన్ గా భారత్ కు చెందిన విశ్వనాథ్ ఆనంద్ ఐదు సార్లు విజేతగా నిలిచాడు. ఆ తరువాత ఇప్పుడు మరోభారతీయుడిగా గుకేష్ దొమ్మరాజు నిలిచాడు. అయితే ఆయన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.
గుకేష్ దొమ్మరాజు 2006 మే 29న తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జన్మించాడు. ఈయన తెలుగు రాష్ట్రానికి చెందిన వారి కుటుంబంలోనే జన్మించాడు. వీరిది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా. ఆయన తల్లిదండ్రులు రజనీకాంత్,పద్మ. 7 సంవత్సరాల వయసు నుంచే ఆయన చెస్ ఆడడం ప్రారంభించాడు. చెన్నైలోని మేల్ ఆయనంబాక్కంలోని వేలమ్మాళ్ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు.
చెస్ ఆడడం అంటే చాలా ఇష్టం ఉన్న గుకేష్ 2013లో వారానికి మూడు రోజులు ఒక గంటపాటు ప్రాక్టీస్ చేసేవాడు. ఈ క్రమంలో ఆయన 2015లో అండర్ 9 విభాగంలో, అండర్ 12 విభాగంలో ప్రపంచ యూత్ చెస్ చాంపియన్ విజేతగా నిలిచాడు. 2018లో వ్యక్తిగత పోటీల్లో 5 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2022లో 44వ చెస్ ఒలంపియాడ్ లో పాల్గొని యూఎస్ నెంబర్ వన్ అయినా ఫాబియానో కరువానాను ఓడించాడు. దీంతో అతడు స్వర్ణం సాధించాడు. 2023లో ఆసియా చెస్ ఫెడరేషన్ లో పాల్గొని ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు.
ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ప్రైజ్ మనీ ని రూ.11.45 కోట్లు అందుకోనున్నాడు. 14 రౌండ్ల పాటు సాగిన ఈ చాంపియన్ మొత్తం రూ.21.22 కోట్లు అందుకోవాల్సి ఉంది. కానీ ఫిడే నిబంధనల ప్రకారం ఒక్కో రౌండ్ లో గెలిచిన విజేతకు రూ.1.69 కోట్లు అందజేస్తారు. అలాగే మూడు రౌండ్లు గెలిచిన గుకేష్, రూ.5.05 కోట్లు గెలిచాడు. లిరేన్ రెండు ఆటలు గెలవడంతో ఆయనకు రూ.3.38 కోట్లు దక్కాయి. మిగిలిన ప్రైజ్ మనీ రూ.1.5 మిలియన్ డాలర్లను సమానంగా పంచడంతో గుకేష్ రూ.11.45 కోట్లు అందుకోనున్నాడు.





