తల్లిదండ్రులు తమతో పాటు తమ పిల్లల భవిష్యత్ కోసం పొదుపు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించబోతుంది. ఇప్పటికే ఆడ పిల్లల సంరక్షణ కోసం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో చాలా మంది చేరారు. నెలా నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పుడీ పథకం కూడా ఇదే తరహాలో మరో కొత్త పథకం అందుబాటులోకి రానుంది. అయితే కొత్త పథకం పిల్లల భవిష్యత్ తో పాటు తల్లిదండ్రులు మలివయసులో ఉండగా పెన్షన్ కోసం ఉపయోగపడనుంది. ఈ పథకం గురించి వివరాల్లోకి వెళితే..
2004 బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త స్కీమ్ ను ప్రకటించారు. అదే ‘ఎన్పీఎస్ వాత్సల్య’. దేశ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే విధంగా దీనిని తీసుకొచ్చారు. ఎన్పీఎస్ వాత్సల్య ను సెప్టెంబర్ 18న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణ్ ఢిల్లీలో ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి 75 ప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దీని గురించి వివరించనున్నారు. పిల్లల పేరిట కొత్త ఖాతాలను తెరిపించే విధంగా కృషి చేయనున్నారు. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాలు తెరవడం ద్వారా వారికి పర్మనెంట్ రిటైర్డ్ అకౌంట్ నెంబర్ ఇవ్వనున్నారు. అలాగే పథకానికి సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేయనున్నారు.
ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో దేశ ప్రజలతో పాటు ఎన్ ఆర్ లు కూడా చేరచ్చు. ఈ పథకంలో సంవత్సరానికి రూ. 1000 నుంచి గరిష్టంగా ఎంత వరకైనా పొదుపు చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు రూ.1.50 లక్షల పొదుపుకు 80 సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. ఇదే విధానం కొత్తగా ప్రారంభించబోయే ఎన్పీఎస్ వాత్సల్య కు వర్తిస్తుంది.
తమ పిల్లల పేరిట ఖాతాలను ప్రారంభించిన తల్లిదండ్రులు 60 ఏళ్లు నిండే వరకు పొదుపు చేయొచ్చు. ఆ తరువాత తాము పొదుపు చేసిన మొత్తంలో 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు. దీనిని వారి పిల్లల కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ తరువాత వారికి పెన్షన్ వస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సెప్టెంబర్ 18న ప్రారంభ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి వెల్లడిస్తారు.