తెలంగాణ రైతుల కోసం బీఆర్ఎస్ తీసుకొచ్చిన ‘ధరణి’ స్థానంలో ఇక ‘భూమాత’ ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీనిని ప్రక్షాళన చేసి రైతులకు ఇబ్బంది లేకుండా మారుస్తామని కాంగ్రెస్ నాయకులు గత ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్త పోర్టల్ ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ధరణి మూసాయిదా కమిటీ అధికారులు ధరణిలో ఉన్న సమస్యలను లెవనెత్తుతూ.. కొన్ని సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించారు. ‘భూమాత’ పోర్టల్ ద్వారా రెవెన్యూ చట్లంలో అనేక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి లో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.
ధరణి పోర్టల్ ద్వారా తెలంగాణలో 22 లక్షలకు పైగా సమస్యలు ఏర్పడ్డాయని అధికారులు గుర్తించారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. 2020లో ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ఛిన్నా భిన్నంగా మారిందని, గ్రామస్థాయిలో రికార్డు పర్యవేక్షణ లేకపోవడం, బాధ్యులు లేకపోవడంతో పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు గుర్తించారు. దీంతో కొత్త ఆర్వో చట్టం 2024ను తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇందులో భాగంగానే ధరణి ప్లేసులో ‘భూమాత’ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ధరణి పోర్టల్ ను అప్పగించిన ఏజెన్సీ గడువు పూర్తయింది. ఇప్పుడు కొత్త ఏజేన్సీకి దీనిని అప్పగించాలని, అది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉందని సిపారసులు చేశారు. ఇందులో భాగంగ ఆన్ లైన్ లోనే దరఖాస్తులు స్వీకరించి, బయోమెట్రిక్ ప్రామాణికం ద్వారా అనుసంధానం చేయనున్నారు. ఇప్పటి వరకు ధరణిలో అనేక మాడ్యుల్స్ ఉన్నాయి. కానీ ఇప్పడు అన్నింటికీ ఒకే మాడ్యుల్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో భూ సమస్యలు పరిష్కారం జరిగేలా ఇప్పుడున్న చట్టంలో కొన్ని కుదింపు చేసి పరిష్కారం అయ్యే విధంగా చూడడం వంటివి చేయాలని తెలిపినట్లు సమాచారం.
1958కి ముందు ఉన్న నిషేధిత భూములను జాబితా నుంచి తొలగించి, పెండింగులో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కల్పించాలి. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వం, అసైన్డ్ భూముల విషయంలో పకడ్బందీ జాబితా తయారు చేసిన పార్ట్ బీ లో ఉన్న భూసమస్యలు పరిష్కరించి వారికి పాసు పుస్తకాలు జారీ చేయాలి. దశల వారీగా భూ సర్వే చేపట్టి శాశ్వత ప్రాతిపదికన భూధార్ కార్డులు జారి చేయాలి. కోనేరు రంగారావు సీఫారసుల ఆధారంగా అటవీ హక్కుల చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలి… వంటి సిపారసులను అధికారులు ప్రభుత్వానికి అందించారు.