హైదరాబాద్ లో చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే FTL( Full Tank Leavel), బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసింది. మిగతా వాటి గురించి నివేదిక తెప్పించుకుంటున్న ప్రభుత్వం వాటిపై కూడా చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే హైదరాబాద్ లోని ఎఫ్ టీఎల్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు కూడా ఉంది. ఈ నిర్మాణాన్ని 30 రోజుల్లోగా కూల్చివేయాలని నోటీసులు కూడా అందించారు. దీంతో అక్రమ నిర్మాణాల విషయలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని కొందరు చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్ లోని దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ వాసులకు నోటీసులు అందించారు. అయితే మాదాపూర్ అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇల్లు,కార్యాలయం దుర్గం చెరువు పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించరు. దీంతో ఈ కట్టడాలను 30 రోజుల్లో తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే నెక్టర్స్, డాక్టర్స్ కాలనీలు, కావూరీ హిల్స్ వాసులకు నోటీసులు అందించారు.
మరోవైపు హైడ్రా పరిధిలో ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు తగ్గినా వెనక్కి తగ్గిదేలే లేదన్నారు. 30 ఏళ్ల కిందట నిర్మించిన అక్రమ కట్టడాలు ఉన్నాయని, ఇవి అక్రమం అని తేలితే వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులైనా ఎఫ్ టీఎల్ పరిధిలో ఉంటే ఆ నిర్మాణాలు కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా బఫర్ జోన్ లో ఉన్న విద్యాసంస్థల అధినేతలు తమ నిర్మాణాల కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెరువులు, బఫర్ జోన్ లో ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టినందునే చిన్న వర్షానికే హైదరాబాద్ లో వరదలు భారీగా వస్తున్నాయని అన్నారు. ఈ తరుణంలో విద్యాసంస్థలకు కూడా మినహాయింపు లేదని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేసుకుంటూ పోతే కోర్టులు కూడా ప్రశ్నిస్తాయని అన్నారు.