తెలంగాణలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఉత్సవాన్ని ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారికంగా నిర్వహిస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు నగరంలోని పలు ఆలయాల్లోని అమ్మవార్లకు బోనాలను సమర్పిస్తారు. చివరగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఈ సందర్భంగా రంగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భవిష్యత్ లో జరిగే విషయాలను స్వర్ణలత అనే మహిళలో అమ్మవారు వచ్చి చెబుతారని భక్తులు నమ్ముతారు. ఈ సందర్భంగా భవిష్యవాణి చెప్పే స్వర్ణలత ఎవరు? అనే ఆసక్తి చర్చ సాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ను చెప్పే స్వర్ణలత పర్సనల్ జీవితం చాలా దయనీయమే అని చెప్పవచ్చు. ప్రతిరోజూ పనిచేస్తే తప్ప పూటగడవని పరిస్థితి. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వర్ణలత తన గురించి చెప్పారు. 1997లో తాను చిన్నగా ఉన్నప్పుడు ముత్యాలమ్మ ఆలయంలో కత్తితో పెళ్లి జరిపించారు. ఆ తరువాత తన జీవితం అమ్మవారికే అంకితమైనట్లు చెప్పారు. పదోతరగతి వరకు చదువుకున్నా జీవితం గడవడానికి దుస్తులను కుడుతూ ఉంటుంది. అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం తరుపున ఆమెను ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పింది.
స్వర్ణ లత వాళ్లది ‘ఏర్పుల’ వంశం. అమ్మవారి ఆలయంలో మొదట్లో ఏర్పుల జోగమ్మ ‘రంగం’ చెప్పేవారు. ఆ తరువాత బాలమ్మ, పోచమ్మ, బాగమ్మల తరువాత స్వర్ణలత వాళ్ల అక్క స్వరూపారాణి చెప్పేవారు. అక్కతో కలిసి గుడికి వచ్చిన స్వర్ణలత ఆమె వారసత్వంగా 1997 నుంచి భవిష్యవాణి వినిపిస్తోంది. స్వర్ణలత కుటుంబంలో జన్మించిన వాళ్లంతా అమ్మవారికే అంకితం అయ్యారు. ఇప్పుడు స్వర్ణలత తమ్ముడు దినేష్ కు కూడా ఆడపిల్ల జన్మించింది. స్వర్ణలత తరువాత ఆమెనే భవిష్య వాణి వినిపిస్తుందని ఆమె చెప్పారు.
ప్రతీ ఏటా రంగం నిర్వహించేందుకు ఒకరోజు ముందుగానే స్వర్ణలత ప్రిపేర్ అవుతారు. రంగం రోజున స్వర్ణ లతకు తమ్ముడ దినేష్ అలంకరణ చేస్తారు. పచ్చికుండను భూమిలో పాతి, దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. ఆ సమయంలో స్వర్ణలతకు ఓడి బియ్యం పోసి రంగం వద్దకు తీసుకొస్తారు. అయితే పూనకం వచ్చిన తరువాత స్వర్ణ లతకు ఏం జరుగుతుందో తెలియదని అమె వివరించారు.