Wednesday, February 5, 2025

జూలై 7 నుంచి బోనాల పండుగ.. ఈ పండుగ ఎప్పుడు మొదలైంది? అసలైన చరిత్ర ఏది?

సాధారణంగా శ్రావణ మాసం నుంచి పూజలు, వ్రతాలు ప్రారంభమవుతాయి. కానీ అంతకుముందు నెల లో అంటే ఆషాఢమాసంలో బోనాల ఉత్సవం నిర్వహిస్తారు. బోనాల పండుగ తెలంగాణలో ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు వారం వారం వివిధ ఆలయాల్లో బోనాల పండుగ నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాల పండుగ ఉత్సవం నిర్వహిస్తున్నా.. హైదరాబాద్ లో వైభవంగా సాగుతాయి. అయితే ఈ బోనాల పండుగ ఉత్సవం ఎప్పుడు ప్రారంభమైంది? ఎలా దీనిని నిర్వహిస్తారు?

2024 సంవత్సరంలో బోనాల ఉత్సవం జూలై 7 నుంచి ప్రారంభం కానుంది. జూలై 5న శుక్రవారం అమావాస్య కావడంతో శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఆ తరువాత వచ్చే తొలి ఆదివారం జూలై 7. అందువల్ల ఈరోజు నుంచే బోనాల పండుగను నిర్వహించనున్నారు.

బోనాల పండుగ ఉత్సవం బ్రిటిష్ కాలం నుంచే ప్రారంభమైంది. ఒకప్పుడు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో పనిచేసేవాడు. అతడు 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఈ సమయంలో ఇప్పటి హైదరాబాద్.. అప్పటి భాగ్యనగర్ లో ప్లేగా వ్యాధి తో వేల మంది చనిపోయారు. ఈ విషయం తెలిసిన అప్పయ్య, తోటి వ్యక్తులు కలిసి అక్కడున్న ఉజ్జయిని ఆలయానికి వెళ్లి అమ్మవారిని తమ వారిని కాపాడాలని వేడుకున్నారు. ఆ సమయంలో ప్లేగు వ్యాధి నుంచి బయటపడ్డారట. దీంతో 1815లో సురయ్య, ఆయన సహచరులు కలిగి భాగ్యనగరానికి వచ్చి సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది ఆషాఢ మాసంలోబోనాల పండుగ నిర్వహిస్తున్నారు.

అయితే మరో చరిత్రలో ఈ బోనాల పండుగను కాకతీయ రాజుల నుంచే నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రతాపరుద్రుడు గోల్కొండ లోని జగదాంబిక ఆలయంలో ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించేవారని తెలుస్తోంది. ఆ తరువాత హైదరాబాద్ కు వచ్చిన నవాబులు జగదాంబిక ఆలయం పురాతనమైనదని గ్రహించి ఆ ఆలయాన్ని అలాగే కొనసాగించారు. అందుకే ఇక్కడ తొలి పూజ నిర్వహిస్తారని అంటారు. రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో, మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలోకి తీసుకెళ్తారు.

బోనం వండేటప్పుడు చాల జాగ్రత్తలు తీసుకుంటారు. అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండ, లేదా రాగి పాత్రలో అమ్మవారికి సమర్పిస్తారు. బోనాన్ని పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. మేళ్ తాళాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి ఊరేగింపుగా వెళ్తారు. గ్రామాల్లోనూ వివిధ దేవతలకు ప్రత్యేకంగా బోనాల పండుగను నిర్వహిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News