కేరళ రాష్ట్రంలో నిర్వహించే ఉప ఎన్నికల్లో నెహ్రూ కుటుంబం నుంచి మరో వారసురాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనున్నారు. ఆమె ఎవరో కాదు సోనియా గాంధీ కుమార్తె, రాహుల్ గాంధీ చెల్లెలు అయిన ప్రియాంక గాంధీ. ప్రియాంక గాంధీ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఆమె పలుసార్లు పాల్గొన్నారు. ఆమె ప్రచారంతో కొన్ని ప్రాంతాల్లో పార్టీ బలపడి చాలా మంది అభ్యర్థులు గెలుపొందారు. తాజాగా ఆమె గెలుపునకోసం ప్రచారం నిర్వహించనున్నారు. కేరళలోని వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయి బరేలీ, వయనాడ్ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఒక ఎంపీపీ ఒక స్థానమే ఉండాలన్న నియమంతో రాహుల్ గాంధీ రాయి బరేలిలో కొనసాగుతూ వయనాడ్ ను వదులుకున్నారు. దీంతో ఆస్థానంలో ప్రియాంక పోటీ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ బయోగ్రఫీ గురించి అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
రాజీవ్ గాంధీ, సోనియాగాందీ దంపతుల గారాల కూతురు ప్రియాంక గాంధీ 1972 జనవరి 12న జన్మించారు. న్యూఢిల్లీలోని మోడల్ స్కూల్లో.. ఆ తర్వాత కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి సైకాలజీ బ్యాచిలర్ డిగ్రీ, బౌద్ధ అధ్యయనాల్లో మాస్టర్ డిగ్రీని చదివారు. ప్రియాంక గాంధీ న్యూఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు
రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ప్రియాంక గాంధీ పార్టీకి సేవ చేశారు. కానీ ఎక్కడా తను పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. 2004 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తల్లితో పాటు ఆమె పలు నియోజకవర్గాల్లోని ప్రచారం పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 జనవరి 23న ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2020 సెప్టెంబర్ 11న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్ర నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడింది.
ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పార్టీ శ్రేణులు ఎప్పటినుంచో కోరుతున్నారు. కానీ ఆమె ప్రచారం వరకు మాత్రమే ఉంటూ వస్తున్నారు. తాజాగా వయనాడు నుంచి పోటీ చేయడం ఆసక్తిగంగా మారింది. నానమ్మ ఇందిరాగాంధీ వలె ఉన్న ప్రియాంక గాంధీ ఎప్పటికైనా రాణిస్తారని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీగా గెలిస్తే వచ్చే ఎన్నికల వరకు ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ అదికారంలోకి వస్తుందని ఆ పార్టీశ్రేణులు చర్చించుకుంటున్నారు.





