భారతదేశానికి వెన్నెముక రైతు. అన్నదాత కష్టం లేనిది ఆహారం ఉత్పత్తి కాదు. కానీ ఒక్కోసారి ప్రకృతి ఉగ్రరూపం రైతుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అకాల వర్షాలు, ఈదురుగాలులతో రైతులు పండించిన పంటకు తీవ్ర నష్టం చేకూరుతుంది. ముఖ్యంగా మామిడి రైతుకు ఈదురు గాలులు గండంలా మారుతాయి. ఈదురు గాలుల కారణంగా మామడి కాయలు రాలిపోయి పనికి రాకుండా పోతాయి. అయితే ఇలాంటి సమయంలో ‘ఆమ్ చూర్’ తయారీతో వీరికి ఊరట కలగనుంది. రాలిపోయిన మామిడి కాయలు. పక్వానికి వచ్చి పాడైపోతాయనుకున్న పండ్లను ఆమ్ చూర్ తయారీకి ఉపయోగించడం వల్ల మామిడి రైతులు రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఆదెలాగో చూద్దాం..
![amchur Making](https://insightearth.in/wp-content/uploads/2024/05/ammchuer-1024x516.jpg)
చింతపండుకు ప్రత్యామ్నాయం ‘ఆమ్ చూర్’..
మనం రోజూ తినే ఆహార పదార్థాల్లో పులుపు తప్పనినసరిగా ఉండాలి. ఇందు కోసం నార్త్ పీపుల్స్ అయితే చింత పండు ఎక్కువగా వాడుతారు. కానీ ఉత్తర భారతంలో ఎక్కువగా ఆమ్ చూర్ ను వాడుతారు. చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఇది ఉండడంతో ఆమ్ చూర్ కు ఉత్తర భారత దేశంతో పాటు విదేశాల్లో బాగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆమ్ చూర్ తయారీ జోరందుకుంది.
![amchur Making](https://insightearth.in/wp-content/uploads/2024/05/ammchuer-4.jpg)
ఆమ్ చూర్ ను ఎలా తయారు చేస్తారంటే?
ఆమ్ చూర్ ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.. మామిడి ముక్కలను కోస్తారు. వీటిని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే బండలపై ఆరబెడుతారు. బాగా ఎండిన తరువాత వీటిని గ్రౌండర్ పడుతారు. ఇవి పిండి పదార్థంలా మారిన తరువాత దానిని జల్లెడ పట్టి నాణ్యమైన పౌడర్ ను ప్యాక్ చేస్తారు. అయితే ఆమ్ చూర్ ను రైతులు విభిన్న రకాలుగా తయారు చేస్తున్నారు. కొందరు వీటిని సాధారణంగా ఎండలో ఆరబెడుతున్నారు. మరికొందరు మాత్రం టన్నెల్ డ్రైయ్యర్ ద్వారా ఆరబెడుతారు. టన్నెల్ డ్రైయ్యర్ ద్వారా ఆరబెట్టడం ద్వారా వీటిపై దుమ్ము, దూళి పడకుండా ఉండడమే కాకుండా ఎలాంటి తేమ లేకుండా ఉంటుంది. బయట ఆరబెట్టడం ద్వారా తేమ పడుతుందని కొందరు రైతులు పేర్కొంటున్నారు.
![amchur Making](https://insightearth.in/wp-content/uploads/2024/05/ammchuer5.jpg)
మామిడి రైతుకు నష్టం లేనట్లే..
సాధారణంగా ఏప్రిల్, మే నెలలో మామిడి కాయలు కోతకు వస్తాయి. ఈ సమయంలో ఈదురు గాలులు పెట్టడం వల్ల కాయలు రాలిపోతుంటాయి. దీంతో రైతులు తీవ్ర నష్టపోతుంటారు. ఈ కాయలను తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుంటుంది. అయితే వీటితో ఆమ్ చూర్ తయారీకి ఉపయోగించడం వల్ల రైతులు రెట్టింపు లాభాలు పొందుతారని అంటున్నారు. అంతేకాకుండా సాధారణంగా రైతులు కిలో మామిడి కి వచ్చే లాభానికంటే ఆమ్ చూర్ తయారీ ద్వారా రెట్టింపు ఉంటుందని అంటున్నారు.
అదెలాంటే కిలో మామిడికాయలను కోస్తే తొక్క టెంక వృథా పోగా 750 గ్రాముల ముక్కలు ఇస్తుంది. వీటిని ఎండబెడితే 350 గ్రాములు లభిస్తుంది. ఈ ముక్కలను చూర్ణం చేసి జల్లెడ పట్టడం వల్ల 250 గ్రాముల చూర్ణం లభిస్తుంది. కిలో మామిడికాయలు అమ్మితే లభించే ధర 20 నుండి 50 రూపాయలు. కానీ పావు కిలో మామిడి చూర్ణం అమ్మితే లభించే ధర 125 రూపాయలు. రైతులు తమ చెట్టు మామిడి కాయలను ఒక్కటి కూడా వృథా పోకుండా ఈ విధంగా లాభాలు తీసుకోవచ్చు. ఆమ్ చూర్ ధర ప్రస్తుతం తెలంగాణలోని నిజామాబాద్ లో క్వింటాల్ కు రూ.25 వేలు పలుకుతుందని కొందరు రైతులు చెబుతున్నారు.
![](https://insightearth.in/wp-content/uploads/2024/05/ammchuer6-1024x576.jpg)