మంచి రాజకీయ నాయకుడు కావాలంటారు.. మంచి ప్రభుత్వం ఉండాలంటారు.. కానీ కొంత మంది ఓటేయడానికి మాత్రం ఓపిక తెచ్చుకోరు.. ఇటీవల జరిగిన సార్వ్రతిక ఎన్నికల్లో తెలంగాణలో చూస్తే గ్రామాల్లో కంటే పట్టణ వాసులే ఓట్లు వేయలేదు. ఈ పరిస్థితి తెలంగాణలోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో నూ ఉంది. ఓటు ఎంత అవసరమో ఓ వైపు ప్రభుత్వంతో పాటు ప్రత్యేకంగా కొన్ని సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయినా చాలా మంది నిర్లక్ష్యం వీడడం లేదు. దీంతో ఓ స్కూల్ యాజమాన్యం వినూత్న ఆఫర్ ప్రకటించింది.తమ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఓటేస్తే 10 మార్కులు కలుపుతామని తెలిపింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఎన్నికల్లో గెలవడానికి కొందరు రాజకీయ పార్టీ అభ్యర్థులు ప్రజలకు వరాలు కురిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఓటేయడానికి ఓ పాఠశాల యాజమాన్యం ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అనేక సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో బిర్యానీ ఫ్రీ, ఆసుపత్రిలో ఓపి ఫ్రీ, ఫ్లైట్ టికెట్ చార్జీలో రాయితీ, సినిమా టికెట్లు డిస్కౌంట్ వంటి ఆఫర్లు ప్రకటించాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని స్కూల్ యాజమాన్యం తమ పాఠశాలలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఓటు వేస్తే పిల్లలకు 10 మార్కులు అదనంగా ఇస్తామని ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల యాజమాన్యం తమ విద్యార్థుల తల్లిదండ్రులు ఓటేస్తే 10 మార్కులు అదనంగా కలుపుతామని ప్రకటించింది. అలాగే తమ స్కూళ్లలో పనిచేసే సిబ్బంది ఓటు వేసే వారికి ఒకరోజు వేతనంగా అదనంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అగర్వల్ మాట్లాడుతూ ‘10 మార్కులు ఒకే సబ్జెక్టులో ఉండొచ్చు.. లేదా అన్ని సబ్జెక్టులకు కలిపి వేయవచ్చు. లక్నో లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ ఆఫర్ పొందేందుకు తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించి సిరా చుక్కను చూపించాలి’ అని అన్నారు.
మరోవైపు దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ను 543 స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికి ఐదు విడుదల్లో పోలింగ్ పూర్తి చేసింది. చివరికిగా మే 20న ఐదో విడత ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ ను నిర్వహించారు. మొదటి నుంచి మూడు విడుదల వరకు 60 శాతం లోపే పోలింగ్ నమోదంది. నాలుగో విడతతో కాస్త పెరిగింది. దీంతో ఐదో విడతలోనైనా పోలింగ్ శాతం పెంచాలని ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంది. అయితే ఈసారి ఎంత శాతం నమోదవుతుందో చూడాలి.





