దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హైదరాబాద్లోని బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ లడ్డు మొత్తానికి రూ.35 లక్షలకు వేలం పాట ద్వారా హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్ ప్రాంతానికి చెందిన లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. బాలాపూర్ లోని వినాయకుడి లడ్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి లడ్డును వేలంపాట ద్వారా దక్కించుకున్న వారికి సిరిసంపదలు వస్తాయని నమ్మకం. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ మొదటిసారిగా 1994లో తొలిసారి లడ్డూ వేలం వేశారు. రూ.450 తో ప్రారంభమైన ఈ లడ్డు ఈసారి రూ. 35 లక్షలకు వేలం వేశారు.

శనివారం సాగిన లడ్డు వేలంలో మొత్తం 38 మంది పాల్గొన్నారు. ఇందులో 31 మంది గతంలో లడ్డును తగ్గించుకున్న వారే. కొత్తగా ఏడుగురు లడ్డువేలంలో పాల్గొన్నారు. లడ్డూ ధరను 30,000 గా.. రూ.5000 నాన్ రిపెండబుల్ అమౌంట్ గా ఏర్పాటు చేశారు. 2024 సంవత్సరంలో బాలాపూర్ లడ్డూను కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమై 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా బాలాపూర్ లడ్డు కోసం ప్రస్తుతం దక్కించుకున్న దశరథ గౌడ్ ఆరేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. చివరికి ఈసారి ఆయనకు దక్కింది.





